మూవీ రివ్యూ: OG
రేటింగ్ : 2.75
దర్శకత్వం : సుజిత్
తారాగణం : పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, తేజ్ సప్రూ, అభిమన్యు సింగ్ తదితరులు
సంగీతం : థమన్
విడుదల తేదీ : 25 సెప్టెంబర్ 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురుచూసిన సినిమా ‘OG’. అనౌన్స్మెంట్ నుండి సినిమాకు సంబందించిన ప్రతి అంశం అంచనాలను పెంచుతూనే ఉంది. అంత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుందో అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో చూద్దాం పదండి.
కథ పరంగా చూస్తే, ఒజాస్ గంభీర (OG) అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపించాడు. ముంబై పోర్ట్ నేపథ్యంతో మొదలైన ఈ కథలో, సత్యదాదా సంరక్షణలో పెరుగుతాడు. ఒక సంఘటన కారణంగా ముంబైకి దూరమై అక్కడికి తిరిగి రావడం, అక్కడ మాఫియా శక్తుల్ని ఎదుర్కోవడమే కథ. ఈ ప్రయాణంలో సత్యదాదా కుటుంబం, పాత శత్రువులు, కొత్త విలన్ కలసి కథలో సంఘర్షణని పెంచుతాయి. దాదా సామ్రాజ్యాన్ని ఎలా కాపాడాడు? ముంబై నుండి దూరం అవ్వడానికి గల కారణం ఏంటి? మళ్ళి ఎలాంటి సంఘటన వల్ల తిరిగి వచ్చాడు? తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా? అనేది తెరమీదే చూడాలి.
ప్రథమార్ధంలో పాత్రల పరిచయాలు, మంచి యాక్షన్ సీక్వెన్స్ తో హీరో పరిచయం, బలమైన ఇంటర్వెల్ బ్లాక్ ఉన్నాయి కానీ హీరోయిన్ తో అనుబంధం ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. వాళ్ళ మధ్యన వచ్చే సీన్స్ మనసుని హత్తుకోవడంలో విఫలం అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ పైన చూపించిన విధానం, యాక్షన్ బ్లాక్స్ తీర్చిదిద్దిన విధానం, హీరో ఎలేవేషన్ సీన్స్, వాటికీ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫాన్స్ థియేటర్లో కుదురుగా కుర్చోనివ్వవు. ఎన్నో సంవత్సరాలుగా తన హీరోని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించడంలో సుజిత్ వంద శాతం సక్సెస్ అయ్యాడు.
సెకండ్ హాఫ్ లో లెక్కకు మించిన కథలు వాటి ఉప కథలతో కొంచెం గందర గోళానికి గురి చేస్తారు. వచ్చే సీన్స్ అన్ని కంటికి చెవికి చాల బలంగా తాకుతుంటాయి కానీ మనసుని తాకవు. స్క్రీన్ పైన రక్తపాతం జరుగుతూ ఉంటుంది చాలా మంది చనిపోతూ ఉంటారు కానీ అయ్యో పాపం అని చూస్తున్న ప్రేక్షకుడి గుండెను మెలిపెట్టవు. ఇది కచ్చితంగా దర్శకత్వ లోపమే. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజన్స్, థమన్ BGM లోపాలను మర్చిపోయేలా చేస్తాయి. ఒక సన్నివేశంలో ట్రావెలింగ్ సోల్జర్ ప్లే చెయ్యడం, జానీ మూవీని గుర్తుచేయడం మాత్రం బావుంది. ఇది ఫాన్స్ ని కచ్చితంగా ఉర్రుతలూగిస్తుంది.
ఎన్ని లోపలున్న ప్రతి సీన్ ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ చాల స్టైలిష్ గా చూపించాడు దర్శకుడు సుజిత్. తక్కువగా డైలాగ్స్ చెప్తూ ఎక్కువ యాక్షన్ చేస్తూ పవన్ కళ్యాణ్ తెరపై మెస్మెరిజ్ చేస్తాడు. ప్రియాంక మోహన్ పాత్రా చాల తక్కువ మరియు బలహీనం. చెప్పుకోవడానికి మనకు, చెయ్యడానికి తనకు పెద్దగా స్కోప్ లేదు. శ్రేయా రెడ్డి పాత్రా మాత్రం చాల బలంగా రాసుకున్నాడు దర్శకుడు. తాను కూడా అంతే బలంగా చేసింది. ఉన్నవాళ్లలో హీరో, విల్లన్ తర్వాత అంత బలమైన పాత్ర ఆమెదే. ఓమిగా ఇమ్రాన్ హష్మీ చాల బాగున్నాడు. OG మరియు ఓమి పేస్ ఆఫ్ సీన్స్ బలంగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్, సుదేవ్ నాయర్, శుభలేఖ సుధాకర్, అభిమన్యు సింగ్ వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు. అర్జున్ గా చేసిన అర్జున్ ప్రసాద్ ది గుర్తుండిపోయే పాత్ర.
మొత్తంగా చూసుకుంటే ఫాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే బావుంటుందో తెలుసుకుని అలాగే తీసిన సినిమా. "ఇంకోసారి ఇలా చేస్తే వార్నింగ్ ఇచ్చేది నీ మొహానికి కాదు నీ మొండేనికి" అని వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంది. ఇది కచ్చితంగా సినిమా లెవెల్ ని పెంచేలాంటి సీన్. ఇలాంటి బలమైన సీన్స్ ఇంకొన్ని కథనంలో రాసుకుని ఉంటె బావుండేది. మొత్తంగా చూసుకుంటే యావరేజ్ కానీ టెక్నికల్ గా మాత్రం స్టైలిష్ గా ఉంది. అభిమానుల ఆకలిని ఖచ్చితంగా తీర్చే సినిమానే ఇది కానీ సామాన్య ప్రేక్షకుడికి అర్ధాకలినే తీరుస్తుంది.
అభిమానులకి అద్భుతం - సామాన్యుడికి OK
కామెంట్స్ (0)
ఇంకా ఆమోదిత కామెంట్‌లు లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!